సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కొంతమంది యువకులు ఇప్పటికే నయాసాల్ వేడుకలకు డ్రగ్స్ తెప్పించుకునే పనిలో పడ్డారు. కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ మజా ఆస్వాదించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న యువకులు.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా గోవా, ముంబయి, బెంగళూరులో ఉంటున్న డ్రగ్స్ వ్యాపారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. సంకేత సంభాషణల ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నారు.
రహస్య మార్గాల్లో డ్రగ్స్ చేరవేత
మత్తుకు బానిసైన వారిలో ఎక్కువగా ఇంజినీరింగ్ విద్యార్థులు, సాప్ట్‌వేర్లు ఉన్నారు. కొకైన్‌తో పాటు ఎల్‌ఎస్‌డీ బ్లాట్లను డ్రగ్స్ విక్రేతలు వీరికి రహస్య మార్గాల్లో చేరవేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, నార్సింగి, ఉప్పల్ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ మార్పిడి జరుగుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు
కొత్త సంవత్సర వేడుకల్లో యువకులు, ఇంజినీరింగ్ విద్యార్థులకు సరఫరా చేసేందుకు కొందరు నైజీరియన్లు గోవా, ముంబయి నుంచి కొకైన్, ఎల్‌ఎస్‌డీ, బ్రౌన్‌షుగర్ తీసుకువచ్చుంటారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు, కొనుగోళ్లు కొనసాగుతుండడంతో తమకు కచ్చితమైన సమాచారం రావడం లేదని చెబుతున్నారు.
వేడుకలే.. లక్ష్యంగా
హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యాపారులు, పార్టీల నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా అక్రమంగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నారు. నయాసాల్ ప్రత్యేక పార్టీలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించే కొందరు నిర్వాహకులను మాదక ద్రవ్యాలు విక్రయించే వారు ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం.
నిఘాతో గుట్టు రట్టు
వారం రోజుల నుంచి ఈ అక్రమ రవాణా వ్యవహారాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిలోల కొద్ది కొకైన్ హైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పోలీస్ అధికారులు ఈ రెండు రోజులు నిఘా ఉంచితే డ్రగ్స్ రాకెట్ల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి.
- ఇదీ చూడండి: 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో వ్యాజ్యం