ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో హానికారక స్టైరీన్ వాయువు లీకై 12 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సందర్శించినప్పుడు ఓ సంఘటన జరిగింది. డీజీపీ అక్కడకు వచ్చిన సమయంలో బాధితులంతా... పరిశ్రమ వద్దకు వచ్చారు. జరిగిన అన్యాయంపై గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డీజీపీ లోపల ఉండటంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
అయితే ఈ దుర్ఘటనలో కన్నబిడ్డను పోగొట్టుకున్న ధన... కోపంతో రగిలిపోయింది. గేట్లను దూకి లోపలకు దూసుకొచ్చింది. ఆ తల్లి ఆవేశాన్ని గుర్తించిన పోలీసులు సైతం మిన్నకుండిపోయారు. కంపెనీ చేసిన తప్పునకు... బిడ్డను పోగొట్టుకున్నానని... తనకు ఎవరు న్యాయం చేస్తారని డీజీపీని ప్రశ్నించింది. ఆయన కాళ్ల మీద పడుతూ... తన బిడ్డను తనకు తెచ్చివ్వమని రోదించింది. ఆమె బాధను చూసిన వారంతా... చలించిపోయారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ధన కుమార్తె... తొమ్మిదేళ్ల గ్రీష్మ మృతి చెందింది.