Double Bedroom Houses Distribution In GHMC : సెప్టెంబర్ 2 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ(Double Bedroom House Scheme)కి శ్రీకారం చుట్టనున్నామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి శనివారం సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి.. అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం, పంపిణీ కోసం ఏర్పాట్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Double Bedroom Houses Scheme In Telangana : ఈ క్రమంలోనే మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12 వేల మంది అర్హులకు ఇళ్లు పంపిణీ చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు. అందుకోసం ఈ నెల 24న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలు గొప్పగా.. ఆత్మగౌరవంతో బతకాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే సకల మౌలిక సౌకర్యాలతో కూడిన రెండు పడక గదుల ఇళ్లు ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తుందని మంత్రి తలసాని వివరించారు.
మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు: తలసాని
26న ఉచిత చేప పిల్లల పంపిణీ.. : మరోవైపు.. ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ(Distribution of free fish) చేపట్టనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదేరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
క్షీర, నీలి, పింక్ విప్లవాల దిశగా అడుగులు: మంత్రి తలసాని
Free Fish Distribution In Telangana : మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 2017 సంవత్సరంలో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. మొదటిసారి రాష్ట్రంలోని 3939 నీటి వనరుల్లో 27.86 కోట్ల చేప పిల్లలు విడుదల చేసినట్లు వివరించారు. ఈ సంవత్సరం 26,357 నీటి వనరుల్లో పుష్కలమైన నీరు నిల్వలు ఉన్న దృష్ట్యా.. రూ.84.13 కోట్ల ఖర్చుతో 85.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
Free Prawns Distribution Scheme In Telangana : అదేవిధంగా మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరుగా మారాలనే ఉద్దేశంతోనే రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 300 నీటి వనరుల్లో రూ.25.99 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Double Bedroom House scheme : 'డబుల్' హామీల్లో వేగం.. నిర్మాణంలో నిదానం
Double Bed Room Houses in Hyderabad : "ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం"