లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ ప్రభావంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా దేశీయ, విదేశీ విమానాల రాకపోకలను పౌరవిమానయాన నిలిపేసింది. అప్పటి నుంచి ఎయిర్ కార్గో విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా... వివిధ దేశాల నుంచి 1,500 మందికి పైగా స్వదేశానికి తీసుకొచ్చారు.
సోమవారం నుంచి విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. మొదటి దశలో 30 శాతం మాత్రమే విమాన రాకపోకలు మొదలవుతాయని, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుందని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్జీకేవై కిశోర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు, వృద్ధులు ప్రయాణించకపోవడం మంచిదని సూచించారు.
ఇవి పాటించకపోతే లోనికి రానివ్వం
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన శాఖ నూచన నియమావళిని అందుబాటులోకి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార పదార్థాలను విమానాల్లో తినడానికి అనుమతించబోమని... ప్రతి ఒక్కరూ మాస్కు వేసుకోవాలని... తరచూ శానిటైజ్ చేసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని లోనికి అనుమతించేది లేదని జీఎంఆర్ యాజమాన్యం స్పష్టం చేసింది.
పటిష్ఠ చర్యలు
భౌతిక దూరం పాటించేలా... ప్రతి మూడడుగులకు గుర్తులు ఏర్పాటు చేశారు. చేతులతో తాకకుండా ఉండేలా సెన్సార్ల ద్వారా పనిచేసేలా తాగు నీరు, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. ప్రతి గంటకు విమానాశ్రయాన్ని శుభ్రపరస్తున్నారు. బోర్డింగ్ పాస్ మొదలుకొని అన్ని పత్రాల పరిశీలనకు మనుషులతో సంబంధం లేకుండా ఏర్పాట్లు చేశారు. విమానాల్లో ప్రయాణించే వారికి క్వారంటైన్ ఉంటుందా? లేదా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయమని కిశోర్ స్పష్టం చేశారు.