హైదరాబాద్ లక్డీకపూల్‌లోని వాసవి ఆస్పత్రి వైద్యులు రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. సంవత్సరాల తరబడి మలవిసర్జన సమస్యతో బాధపడుతున్న రోగికి పెద్ద పేగును పూర్తిగా తొలగించారు. చిన్న పేగును రెక్టమ్‌కు కలిపి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి.వి.ఎల్ నారాయణరావు తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేటకు చెందిన ఆకుల పూర్ణచంద్రరావు(50).. గత కొన్నేళ్లుగా మలవిసర్జన సమస్యతో అనేక ఆస్పత్రులు తిరిగాడు. ప్రయోజనం లేక లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. ఆ ఆస్పత్రి వైద్యులు రోగికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. పెద్ద పేగు పూర్తిగా కదలికలు లేకపోవడం, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు తలెత్తడంతో ఆ పేగును పూర్తిగా తొలగించాలని నిర్ణయించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నెల 2న ఐదున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. చికిత్స తరువాత పూర్ణచంద్రరావు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నాడని... సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతం పట్ల అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
అదేవిధంగా చిన్నతనం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న మహేష్(29)కి.. డాక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో డిస్టల్ పాంక్రియాటిక్ పద్ధతిలో కడుపులో పూర్తిగా గడ్డకట్టిన ప్లీహాన్ని తొలగించారు. ప్రైవేటుగా రూ. 10 లక్షలు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా కేవలం రూ. 1.20 లక్షల్లోనే విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రెండు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆస్పత్రి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 204 కేసులు