సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో(gandhi hospital) వైద్యవిద్యా సంచాలకులు రమేశ్‌రెడ్డి విచారణ జరుపుతున్నారు. మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణపై ఆయన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అంతర్గత కమిటీ నివేదిక సమర్పించినట్లు సమాచారం.
ఆరోపణలపై ఆరా
గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం జరిగిందనే ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోందని సూపరింటెండెంట్ రాజారావు(raja rao) వెల్లడించారు. చిలకలగూడా పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. ఘటనపై గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందితో సమావేశం నిర్వహించామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాల(cc camera) నిఘా పటిష్ఠంగా ఉందని రాజారావు వివరించారు.
సీసీ కెమెరాల నిఘా
కొవిడ్(covid) ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత 209 కెమెరాలు ఉండగా.. అందులో 189 పని చేస్తున్నాయని తెలిపారు. పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు 24 గంటలపాటు సెక్యూరిటి కచ్చితంగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటన ఆస్పత్రి ఆవరణలో జరిగే అవకాశాలే లేవని గాంధీ సూపరింటెండెంట్ మరోసారి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ప్రాథమికంగా నివేదిక ఇచ్చామన్నారు. అనుమానితుడు టెక్నీషియన్ ఉమా మహేశ్వర్‌ను సస్పెండ్ చేశామని రాజారావు వెల్లడించారు. అనుమానితులు అందరిని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆస్పత్రిగా సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. నిజంగానే అలాంటి ఘటన జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
దర్యాప్తు వేగవంతం
గాంధీ ఆస్పత్రి ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపడంతో అదృశ్యమైన మహిళ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. బాధితురాలు ఆమె సోదరికి కల్లు తాగే అలవాటు ఉంది కనుక సమీపంలోని కల్లు దుకాణం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా విశ్లేషిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ సోదరి బయటకు వెళ్లే సీసీటీవీ దృశ్యాలను సేకరిస్తున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
హోం మంత్రి పర్యవేక్షణ
ఘటనకు మూడు రోజుల ముందు ఇద్దరూ కల్లు సేవించినట్లు గుర్తించారు. మరోవైపు అనుమానితులు ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డులపై విచారణ కొనసాగుతోంది. విచారణలో తమకు ఎలాంటి సబంధం లేదని... ఎవరిపైనా అత్యాచారం చేయలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. బాధితురాలు చెప్తున్న విషయాలు, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వాస్తవమేనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును హోం మంత్రి మహమూద్ అలీ పర్యవేక్షిస్తుండటంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది.
ఇదీ చదవండి: Gandhi Hospital Rape Case: 'గాంధీ'లో అత్యాచారంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం