DK Aruna on Rains in Telangana : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల అనేక జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. వరంగల్ పట్టణంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. నగరంలోని 150 కాలనీలు నీట మునిగిపోయాయని తెలిపారు. ఈ క్రమంలోనే వరంగల్‌ను ఎంతో అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తే వరంగల్ ఎందుకు నీట మునిగిందని ప్రశ్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
వరంగల్‌ను డల్లాస్, సింగపూర్ చేస్తామని.. కేసీఆర్ గొప్పలు చెప్పారని డీకే అరుణ గుర్తు చేశారు. మరి అవి ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దిక్కుతోచని స్థితిలో రైతులు, ఇళ్లలోని ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. వాళ్ల కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40,000 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డాయని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వర్షాలపైన సమీక్ష చేయలేదని డీకే అరుణ విమర్శించారు.
DK Aruna Fires on Telangana Government : వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కాలేదని డీకే అరుణ మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు, సర్వం కోల్పోయిన కుటుంబాలకు సర్కార్ భరోసా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వివరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర సర్కార్ రోడ్లు వేసిన పరిస్థితి లేదని డీకే అరుణ విమర్శించారు.
DK Aruna Fires on KCR : వర్షాలతో ప్రజలు కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. వానలతో నష్టపోయిన జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వరదల వల్ల సర్వం కోల్పోయిన వారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్నికల కోసమే ఈ నెల 31న కేసీఆర్ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.
"భారీ వర్షాల వల్ల అనేక జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరంగల్ పట్టణంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. వరంగల్‌లో 150 కాలనీలు నీట మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తే వరంగల్ ఎందుకు నీట మునిగింది. డల్లాస్, సింగపూర్ చేస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పారు. అవి ఎక్కడికిపోయాయి. రాష్ట్రంలో దిక్కుతోచని స్థితిలో రైతులు, ఇళ్లలోని ప్రజలు ఉన్నారు. వాళ్ల కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. 40,000 కుటుంబాలు కట్టు బట్టలతో రోడ్డునపడ్డాయి. కూలిపోయిన ఇళ్లు, ఎంతమంది నిర్వాసితులయ్యారనే నివేదిక తెప్పించుకోవాలి. పంట నష్టపోయిన రైతులకు, సర్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే సమీక్ష చేయాలి." - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇవీ చదవండి : Weather report today : తెలంగాణలో అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం.. ఐఎండీ హెచ్చరిక
Helicopters To Moranchapalli : హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్.. మోరంచపల్లి గ్రామస్థులు సేఫ్