DK Aruna On CM Kcr: సీఎం కేసీఆర్ కపట ప్రేమను చూసి అమరవీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగలేదంటూ అమరవీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం పోయిందని డీకే అరుణ అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలు కూడా ఆ పార్టీకి తొలగిపోయాయని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. ప్రధాని మోదీ, భాజపాపై పదేపదే విమర్శలు చేస్తూ జాతీయ నాయకుడిని అవుతాననే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని.. 8 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎంతవరకు నెరవేర్చారని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పూర్తిగా వంచించి జాతీయ రాజకీయాల గురించి సీఎం మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.
భాజపా ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదన్నారు. తెరాస ప్రభుత్వ మొదటి కేబినెట్లో మహిళకు స్థానమే దక్కలేదని గుర్తుచేశారు. ఏదైనా చెప్పేముందు.. ముందు పాటించి వేరే వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. తన కేబినెట్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ తగ్గిస్తే ఇక్కడ ఒక్కరూపాయి కూడా తగ్గించలేదన్నారు. గవర్నర్‌ను అవమానించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు భాజపాను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కేసీఆర్ కపట ప్రేమను చూసి అమరవీరుల ఆత్మలు కన్నీరు పెట్టుకుంటున్నాయి. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ. కేంద్రం ప్రభుత్వంపై స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. భాజపా ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టింది. దేశ ప్రజల కోసం అహర్నిషలు పనిచేసే వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ. మీరు పీకేని తెచ్చుకున్నా... ఏకేని తెచ్చుకున్నా... గెలిచేది భాజపానే.
-- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు