Regional Ring Road Land acquisition: ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లాలవారీగా సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు అవసరమైన యంత్రాంగాన్ని జనవరి చివరిలోగా సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
158 కిలోమీటర్ల మేర ఉత్తరభాగానికి భూసేకరణ చేపట్టేందుకు.. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-యాదాద్రి-చౌటుప్పల్ మార్గం మీదుగా వెళ్తుంది. దీనికోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉంది.
ఒక్కో జిల్లా పరిధిలో కాస్త అటూఇటుగా 40 కిలోమీటర్ల పరిధి ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూసేకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నాలుగు జిల్లాల్లో అధికారులు, సిబ్బందితో కూడిన ఒక్కో యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నెలాఖరులోగా ఆ యూనిట్లను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: Regional Ring Road: ఉత్తర భాగానికి క్లియర్.. దక్షిణ భాగంపై మళ్లీ ట్రాఫిక్ అధ్యయనం!