వివిధ దేశాలు, రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో కేపీహెచ్బీ కాలనీలోని 'అందరికీ ఆరోగ్యం' యోగా కేంద్రంలో పురోహితులకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. లాక్డౌన్ని సమర్థంగా అమలు చేయటం వల్ల రాష్ట్రంలో పాజిటివ్ కేసులను అదుపులో ఉంచగలిగామని వెల్లడించారు. కరోనా మహమ్మారిపై అవగాహన లేక కొంతమంది అనవసరంగా బయటకు వస్తున్నారని... అలా రావొద్దని విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చినపుడు హైదరాబాద్ పూర్తిగా భిన్నమని, ఇక్కడ సుమారు కోటి మందికి పైగానే జనాభా నివసిస్తున్నారని తెలిపారు. అందువల్లనే భాగ్యనగరంలో వైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. లాక్డౌన్ కొనసాగింపు లేదా ముగింపు విషయం ఇప్పుడే చెప్పలేమని... అప్పటికి ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.
ఇవీ చూడండి : గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు