ఆంధ్రప్రదేశ్ విశాఖలో ఆక్రమణలన్నింటి వెనకా నేతలే ఉంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం పార్టీలో పెను దుమారాన్నే రేపింది. ఆ మాటలకు నొచ్చుకున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమావేశంలో ఒకింత ఆవేశంగా మాట్లాడి అభ్యంతరం వ్యక్తం చేయడం కలకలం రేపింది. నాడు-నేడు పనుల తీరుపై మరో ఎమ్మెల్యే అమరనాథ్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఆ మేరకు తమ అసంతృప్తి వెల్లడించారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
కారణాలపై ఆసక్తికర చర్చ..
జిల్లాలోని ఇద్దరు కీలక నేతలు బహిరంగ వేదికపై తమ ఆవేదన వ్యక్తం చేయటానికి దారితీసిన పరిస్థితులపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చూస్తుండటం కొందరికి మింగుడు పడడంలేదు. పలువురు వైకాపా నాయకులు చెప్పిన పనులను కూడా అధికారులు చేయడంలేదన్న అసంతృప్తి కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. కీలక అధికారులందరూ విజయసాయిరెడ్డి సూచనలు మినహా ఇతర ప్రజాప్రతినిధులు సిఫార్సుల్ని పట్టించుకోవడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు తెదేపా నుంచి వైకాపాలో చేరారు. కొత్తగా వచ్చిన నేతలు కావడంతో వైకాపా పెద్దలు వారికి కొంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే భావనను వైకాపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి అపాయింట్‌మెంట్ సైతం దొరకడం లేదన్నది మరికొందరి ఆవేదన.
- ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి విశాఖకు వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆయన్ను కలుసుకోవడానికి కొందరిని అనుమతించకపోవడం కూడా నేతల్లో ఆవేదన నింపింది. జిల్లాలోని అత్యంత సీనియర్ నాయకులు, కీలక నాయకులు కూడా వైకాపా పెద్దలను కలవడానికి గంటలపాటు వేచిచూడాల్సి వస్తుండడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
నేడు ఎమ్మెల్యేలతో సమావేశం..
వైకాపా నేతలతో విజయసాయిరెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలందరూ ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. కొవిడ్ నేపథ్యంలో ఇటీవల వరకూ సభలు, సమావేశాలు చాలా వరకు తగ్గాయి. అత్యవసరమైతేనే కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆయా పరిస్థితులు ప్రజాప్రతినిధులకు ఆవేదన కలిగిస్తుండడంతో గతంలో మాదిరిగా ప్రజాప్రతినిధులతో తరచూ భేటీ కావడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా వివాదానికి కొవిడ్ పరిస్థితులు కూడా కొంత కారణమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
- ఇవీ చూడండి: 'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'