Telangana Budget Sessions 2023-24: కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ రూపరేఖలు మారిపోయాయని ప్రభుత్వం చెబుతుందని కాని వాస్తవం అది కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు కానీ.. దానికి డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ లేవని ఆరోపించారు. కాళేశ్వరం అద్భుతం అంటున్నారు.. బయట వ్యక్తులను చూడనిస్తారు.. కానీ తమను చూడనివ్వడం లేదని విమర్శించారు. ఇంత వరకు 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వలేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
సభాపతి బెదిరించే ధైర్యం తమకు లేదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఉమ్మడి 7 జిల్లాల్లో సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రీ డిజైన్ చేశారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మించారని.. ముంపు బాధితులు నష్టపోకుండా చూడాలని ప్రభుత్వానికి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైందని .. ఇప్పటికి కూడా మొదలు పెట్టలేదని ఆరోపించారు. దేవాదుల త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని భట్టి విక్రమార్క కోరారు.
అనవసరంగా తమపై బురద జల్లే ప్రయత్నం: భట్టి వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు. అనవసరంగా తమపై నిందలు వేయవద్దని సూచించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వచ్చాయని హరీశ్ రావు తెలిపారు. అందువల్ల కాళేశ్వరంలో మోటార్లు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. అనవసరంగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోజు వరదల వల్ల.. ఆ ప్రాంతమంతా బురదమయం అయ్యిందని.. అందుకే ఎవర్ని అక్కడికి అనుమతించలేదని పేర్కొన్నారు. వరదలతో కాళేశ్వరం దెబ్బతినడంతో కాంగ్రెస్ నేతలు అనందపడ్డారని ఆరోపించారు.
ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తాం: పైసా ఖర్చు లేకుండా మోటార్లు బాగుచేసి.. యాసంగి పంటకు నీరు అందించామని వివరించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కాళేశ్వరం సందర్శనకు భట్టి విక్రమార్క వెళ్లవచ్చని చెప్పారు. ఒక వేలు తమ వైపు చూపిస్తే.. మిగిలిన మూడు వేళ్లు మీ వైపు చూపిస్తాయని దుయ్యబట్టారు. ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్న ఐదుగురు ఉండరని అన్నారు. కొరడాతో కాంగ్రెస్ నేతలు వారినివారే కొట్టుకుంటున్నారని వెల్లడించారు. అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను ప్రజలు గమనిస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: పాతబస్తీకి మెట్రో పక్కా.. మూడేళ్లలో ఎయిర్‌పోర్టు మెట్రో రెడీ : కేటీఆర్
పాలు పొంగని పాత్రను తయారు చేసిన విద్యార్థిని.. అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం