Union Ministry of Finance On AP Revenue: ఆంధ్రప్రదేశ్‌కు సొంత వనరుల నుంచి ఆదాయం పెద్దగా తగ్గలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 'గత 6 బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను, పన్నేతర మార్గాల నుంచి మొత్తం రూ.4,76,741 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా రూ.3,31,531 కోట్లు వచ్చింది. అంటే ఆరేళ్లలో అంచనాల్లో సగటున 69.54% ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది. గత మూడేళ్లలో రాష్ట్ర సొంత వాస్తవ ఆదాయం రూ.60వేల కోట్లను దాటింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.62,427 కోట్లు రాగా, 2019-20లో రూ.60,916 కోట్లు, 2020-21లో రూ.60,687 కోట్లు వచ్చింది' అని సభలో మంత్రి వెల్లడించారు.
'కరోనా కారణంగా రాష్ట్రాల ఆదాయాలు భారీగా పడిపోయాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ 2019-20, 2020-21 మధ్య ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయ వనరుల్లో రూ.229 కోట్ల తగ్గుదలే కనిపించింది. ఇదే సమయంలో కేంద్రం నుంచి పన్నులు, ఇతర సాయాల రూపంలో వచ్చిన ఆదాయం రూ.16,087.58 కోట్లు పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి పన్నుల వాటాలు, కేంద్ర సాయం, రుణాలు, అడ్వాన్సుల రూపంలో ఏపీకి రూ.4,07,488 కోట్లు, తెలంగాణకు రూ.2,99,811 కోట్లు అందాయి. గత ఆరేళ్లలో మూడేళ్లు రాష్ట్ర సొంత ఆదాయం కంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులే అధికంగా ఉన్నాయి. విభజన అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వనరుల్లో పన్నుల వాటా కింద రూ.1,92,641.43 కోట్లు, కేంద్ర సాయం కింద రూ.2,02,393.61 కోట్లు... రుణాలు, అడ్వాన్సుల కింద రూ.12,450.21 కోట్లు వచ్చింది.
14వ ఆర్థిక సంఘం కాలంలో... రూ.529 కోట్లు కోల్పోయిన ఏపీ స్థానిక సంస్థలు
పద్నాలుగో ఆర్థిక సంఘం కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు రూ.529.96 కోట్లను కోల్పోయాయి. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో స్థానిక సంస్థలకు రూ.8,654.09 కోట్లను కేటాయించగా చివరకు రూ.8,124.13 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ లోక్‌సభలో చెప్పారు. 14వ ఆర్థికసంఘం కాల పరిధి ముగిసిపోయినందున మిగిలిపోయిన నిధులను ఇకపై విడుదల చేయబోమని స్పష్టంచేశారు. ప్రస్తుతం 2020-26 మధ్యకాలంలో 15వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నాం ' అని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
ఇదీ చదవండి.. ఒమిక్రాన్ తేలాకే... ఐటీ ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు