TS Assembly Sessions 2023: శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ అధికార పార్టీ శాసనసభ్యడు సండ్ర వెంకటవీరయ్య తీర్మానం పెట్టగా.. మరో సభ్యుడు వివేకానంద్‌గౌడ్ బలపర్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని వెంకట వీరయ‌్య అన్నారు. దళితబంధుపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చర్చలో పాల్గొన్న సభ్యుడు వివేకానంద.. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ ప్రభావం విస్తరిస్తోందన్న అక్కసుతోనే కేంద్రం ఇలాంటి దాడులకు పాల్పడుతోందన్నారు. అదానీ సంస్థల వ్యవహారం, రాష్ట్రంలో ఐటీ దాడులపై బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది.
రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను విస్మరించిందా లేక గవర్నర్ తొలగించారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. అక్బరుద్దీన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అభ్యంతరం చెప్పారు. తాను ప్రజా సమస్యల గురించే చెబుతున్నా అంటూ.. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, పాతబస్తీకి మెట్రో, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ఎప్పుడొస్తాయో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల మాట మరచిపోయిందని విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ముస్లిం మైనార్టీల 4 శాతం రిజర్వేషన్లను పరిరక్షిస్తామని అన్నారు. మెట్రో రెండో విడత కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను విస్మరించిన కేంద్రం.. రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
ముఖ్యమైన సమస్యలకు స్థానం ఇవ్వలేదు..: గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన ప్రజా సమస్యలకు స్థానం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు 200 గజాల ఇండ్ల స్థలాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హమీ నెరవేర్చాలని కోరారు. అనాథ పిల్లలకు వసతి గృహాలు, నిరుద్యోగులకు భృతి హామీలు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్రంలో పోడు భూముల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలుపుతూ.. తెలంగాణకు సహకారం విషయంలో కేంద్రం చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఎస్‌డీఎఫ్ నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని గవర్నర్ ప్రసంగం ప్రతిబింబించిందని అధికార బీఆర్ఎస్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని వాస్తవిక అంశాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రసంగంలో చేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
ఇవీ చూడండి..
మాది కుటుంబ పాలనే.. 4 కోట్ల మంది మా కుటుంబం: కేటీఆర్
అసెంబ్లీలో అదానీ ఇష్యూ.. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం