కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినా నిరంతరం పాఠాలు వినేందుకు, చదువుకునేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత 9, 10 తరగతుల కోసం డిజిటల్ పాఠాలు తీసుకువచ్చారు. విద్యార్థులు https://deohyd.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా తమ తరగతులకు సంబంధించి సబ్జెక్టుల పాఠాలు వినవచ్ఛు ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో మొత్తంగా 1.32 లక్షల మంది వినియోగించుకునే వీలుంది.
ఏమిటీ గ్రంథాలయం?
ప్రస్తుతం ఆన్‌లైన్ బోధనకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎప్పటికీ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా డిజిటల్ పాఠాలు తయారు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. 6 నుంచి 10 తరగతులకు వీటిని రూపొందించి డిజిటల్ గ్రంథాలయంలో ఉంచుతారు. ప్రతి తరగతికి చెందిన ప్రతి సబ్జెక్టులోని పాఠాలన్నీ సిలబస్ ప్రకారం రికార్డు చేయించి నిక్షిప్తం చేశారు. విద్యార్థులు ఎక్కువసేపు చూడాలంటే ఇబ్బందిపడే అవకాశం ఉన్నందున ఒకే పాఠాన్ని నిడివి ప్రకారం చిన్న చిన్న భాగాలుగా విభజించి రికార్డు చేయించారు. 60 మంది ఉపాధ్యాయులు ఈ క్రతువులో భాగస్వామ్యమయ్యారు.
మూడు భాషల్లో అందుబాటులోకి..
తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ డిజిటల్ పాఠాలు వినే వీలుంది. 9, 10 విద్యార్థుల కోసం తొలి మూడు నెలల సిలబస్ పాఠాలు ప్రస్తుతం ఉంచారు. ఏడాదికి సంబంధించి సిలబస్‌ను నిర్దేశిత సమయం ప్రకారం విభజించి రికార్డు చేస్తున్నారు. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులెవరైనా వినియోగించుకునేలా దీనిని తయారు చేశాం. దశలవారీగా మిగిలిన తరగతుల పాఠాలు అందుబాటులోకి తీసుకువస్తాం.’’ అని హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి తెలిపారు.
- ప్రతి వీడియోకు సంబంధించి పాఠం ఎక్కడుందో తెలిపేలా పాఠ్యపుస్తకంలో పేజీలు ఉంటాయి.
- విద్యార్థులు సదరు పాఠం విన్న వెంటనే ప్రశ్నలకు జవాబులు రాసేందుకు వీలుంది. ముందుగా జవాబులతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. స్వతహాగా పరిష్కరించేందుకు వీలుగా మరికొన్ని ప్రశ్నలు అందుబాటులో ఉంటాయి.
- అన్ని మాధ్యమాల పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఇదీ చదవండిః కొవిడ్ ఎఫెక్ట్ : విద్య, యోగ, కళల సాధనకు ఆన్‌లైన్ మంత్రం