పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి టీవీ పాఠాలు ప్రసారం కానున్నాయి. గత విద్యా సంవత్సరం (2020-21)లో ప్రత్యక్ష తరగతులు జరగనందున కింది తరగతుల పాఠ్యాంశాలపై అవగాహన పెంచేందుకు రోజుకు ఒక మాధ్యమానికి అరగంట పాఠాలను ప్రసారం చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలు కలిపి దూరదర్శన్ యాదగిరి, టీశాట్ విద్యా ఛానెల్ ద్వారా రోజుకు 8 గంటలపాటు పాఠాలు ప్రసారం అవుతాయి. శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో టీవీ పాఠాలు ఉండవు. జులైలో 21 రోజులు మాత్రమే బ్రిడ్జి కోర్సు పాఠాలు వస్తాయి. గరిష్ఠంగా పదో తరగతి విద్యార్థులు రోజూ 2 పీరియడ్లు టీవీ పాఠాలు చూడొచ్చు.
నాలుగు స్థాయులుగా..
మూడు నుంచి పదో తరగతి వరకు నాలుగు స్థాయులుగా విభజించి బ్రిడ్జి కోర్సులను అందించాలన్నది విద్యాశాఖ ప్రణాళిక. దీని ప్రకారం లెవెల్-1లో 3, 4, 5 తరగతులు, లెవెల్-2లో 6, 7 తరగతులు, లెవెల్-3లో 8, 9, లెవెల్-4లో పదో తరగతి ఉంటాయి. లెవెల్-1 పాఠాన్ని 3, 4, 5 తరగతుల వారు చూడొచ్చు. ఒక్కోస్థాయి పాఠం 30 నిమిషాలు ఉంటుంది. వారానికి అయిదు రోజుల పాటు రోజూ దూరదర్శన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, టీశాట్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆరు గంటల పాటు.. పాఠాలు ప్రసారం చేయనున్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా నేటి నుంచి టీవీ పాఠాలు ప్రసారం కానున్నాయి. జనరల్ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు దూరదర్శన్‌లో ప్రసారమవుతాయి. టీశాట్ విద్యా ఛానెల్‌లో ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పాఠాలు ప్రసారమవుతాయి.
సగం మంది ఉపాధ్యాయులే విధులకు
జూన్ 25వ తేదీ నుంచి ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరవుతున్నారు. విద్యాశాఖ తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం జులై 1వ తేదీ నుంచి సగం మందే విధులకు వెళ్లాలి. మిగిలినవారు ఇంటి నుంచి పనిచేయాలి. డిజిటల్ తరగతుల నిర్వహణ, విద్యార్థులపై పర్యవేక్షణ తదితర అంశాలపై బుధవారం రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదు.
ఇదీ చదవండి: MMTS: నేటి నుంచి అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్ సర్వీసులు