తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే పాఠ్యపుస్తకాల ముద్రణ వేగంగా సాగుతోంది. మార్చి నెలాఖరు వరకు పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరనున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నాటికి జిల్లా కేంద్రాల నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పుస్తకాలను మండలకేంద్రాలకు, పాఠశాలలకు తీసుకెళ్తారు. ఈ సారి ఆగస్టులోనే కాగితాన్ని కొనుగోలు చేసినందున టన్ను రూ.66,400కు లభించడంతో గత ఏడాది కంటే రూ.9 కోట్లు ఆదా అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల పుస్తకాల కోసం త్వరలో టెండర్లు ఖరారు చేసి ఏప్రిల్ నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ సారి ప్రత్యేకతలు
పుస్తకాలకు వెనుక ఉండే కవర్ పేజీపై ‘ఇన్ ఎనీ ఎమర్జెన్సీ డయల్ 100’ అని ముద్రించారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పటికే ముద్రణ ప్రారంభం కావడంతో 40 శాతం పుస్తకాలపైనే ‘100’ దర్శనమివ్వనుంది. తెలంగాణ పోలీసు చిహ్నం కూడా అందులో ఉంది.
ఈ సారి 8, 9 తరగతుల్లో జీవ, భౌతిక, సాంఘికశాస్త్రాలు, గణితం పుస్తకాలలో క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నారు. ఆయా పాఠ్యాంశాల్లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మరింత వివరంగా సమాచారం, వీడియోలు, చిత్రాలు ఫోన్‌లో వస్తాయి. స్కాన్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రూపొందించిన దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి