DH Srinivasa Rao Warning Private Hospitals: వైద్యో నారాయణో హరి. అలాంటిది అర్హత లేకుండానే రోగులకు చికిత్స అందించి చివరికి వారి మరణానికి కారణమవుతున్న వైద్యులపై కఠిన చర్యలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఎంబీబీఎస్ వైద్యులమంటూ పలువురు నకిలీలు ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూశాయి. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.
దీంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు క్లినిక్‌లు, ఆసుపత్రులు తనిఖీ చేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నమోదు కానీ, నిబంధనలు పాటించని ఆస్పత్రులను గుర్తించి చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓలను ఆదేశించింది. ఇప్పటి వరకు 81 ఆస్పత్రులు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తునట్టు గుర్తించినట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు. ఆయా ఆసుపత్రులను సీజ్ చేయటంతోపాటు.. 64 ఆస్పత్రులకు జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు అర్హత లేకపోయినా అక్రమంగా అబార్షన్లు చేయటం, చిన్నచిన్న సర్జరీలు చేస్తునట్టు తమ దృష్టికి వచ్చిందని డీహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. అనేకచోట్ల ఆర్ఎంపీలులు స్వయంగా ఇంజక్షన్లు చేయటం, సెలైన్లు ఎక్కిస్తుండటంతోపాటు.. స్టెరాయిడ్‌లు, యాంటీ బయోటిక్ మందులను సైతం వాడాల్సిందిగా రోగులకు సిఫార్సు చేస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.
పరిధి దాటి పనిచేస్తున్న వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం వెనకాడబోమని డీహెచ్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. పలువురు అయుష్ వైద్యులు ఎంబీబీఎస్ బోర్డులు పెట్టుకుని చికిత్స అందిస్తున్నట్టు తమ తనిఖీల్లో తేలిందన్న ఆయన.. అర్హత లేకుండా ఎవరు రోగులకు చికిత్స అందించినా సహించేది లేదని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది డబ్బు డిమాండ్ చేసిన ఘటనలు సైతం తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు అలాంటి వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని శ్రీనివాస రావు తెలియజేశారు.
అసలేం జరిగిదంటే: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఈ నెల 23 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అర్హత లేని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది.. అవసరమైన వైద్య సిబ్బంది లేకపోవడం.. అనుమతులు తీసుకోకపోవడం.. నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పించకపోవడం.. పారిశుద్ధ్యం తదితర అన్ని కోణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాలకు లంచాల జబ్బు
హైదరాబాద్లో మళ్లీ వర్ష బీభత్సం.. చెరువులా మారిన విజయవాడ జాతీయ రహదారి