రాష్ట్రంలో అలజడి సృష్టించే మావోయిస్టుల ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నక్సల్స్ కదలికల నేపథ్యంలో కుమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ పర్యటించారు. శుక్రవారం కుమురం భీం జిల్లాకు వెళ్లిన డీజీపీ పరిస్థితులపై ఆరా తీశారు. శనివారం ఆసిఫాబాద్‌లో అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అనంతరం ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి.. నక్సల్స్‌ను అడ్డుకోవడంపై ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ఇన్నాళ్లు లేఖల ద్వారా..
హరి భూషణ్, ఆజాద్, దామోదర్ వంటి అగ్రనేతలు.. ఛత్తీస్‌గఢ్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతూ.. అమాయకులను విప్లవం వైపు నడిపిస్తున్నారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నాళ్లు లేఖల ద్వారా వ్యాపారులు, కాంట్రాక్టర్లను భయపెట్టి డబ్బులు వసూలు చేసి.. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నక్సల్స్‌కు సహకరించవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
డైరీ ఆధారంగా..
ఈ నెల 12న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ అడవుల్లో మావోయిస్టుల అలజడితో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. 12న కొంతమంది మావోయిస్టులు పోలీసుల కూంబింగ్ నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ తప్పించుకున్నారు. అయితే ఎదురుకాల్పుల సమయంలో దొరికిన డైరీలోని సమాచారం మేరకు... పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక నేత మైలారపు అడెల్లు సహా ఐదుగురు నక్సల్స్ అడవుల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
18 మంది నక్సల్స్ ఫొటోలతో వాల్ పోస్టర్లు:
ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, జీపీఎస్ సాంకేతికతను వినియోగిస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. నాటుపడవలతో గోదావరి దాటే ప్రయత్నం చేస్తారనే అనుమానంతో.. రేవులవద్ద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. కచ్చితంగా త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.. 18 మంది నక్సల్స్ ఫొటోలతో వాల్ పోస్టర్లు విడుదల చేశారు. వారి సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
ఇది చదవండి: 'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'