రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి తగ్గేలా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటించి లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శివారు బాహ్య రహదారి కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను డీజీపీ తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రోగులను అంబులెన్సులను అనుమతిస్తున్నామని… ఇతర అత్యవసర పనుల కోసం ఈ పాసుల సహాయంతో విడిచిపెడుతున్నట్లు జరుగుతోందని ఆయన తెలిపారు. లాక్ డౌన్లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు యంత్రాంగానికి తగు సూచనలు చేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవాడలో ఫార్మా కంపెనీలకు అనుమతించామని ఇతర పరిశ్రమలు మినహాయింపు ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించి సహకరించాలని ఆయన తెలిపారు.