నకిలీ విత్తనాల తయారీ దందాపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన పోలీస్, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాల్లో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. పీడీ చట్టం ప్రయోగించడం ద్వారా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటివరకు 13 మందిపై సంబంధిత చట్టం ప్రయోగించినట్లు గుర్తు చేశారు.
ఠాణాల వారీగా నకిలీల దందా మూలాలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక నిఘా, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత చరిత్ర ఉన్నవారిపై హిస్టరీషీట్లు నమోదు సహా వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఈ ముఠాలకు ఆర్థిక సహాయం అందించే వారినీ ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల వ్యవస్థను రూపుమాపేందుకు వ్యవసాయ అధికారులు పోలీసుల సహకారం తీసుకోవాలని జనార్దన్‌రెడ్డి సూచించారు. అసలు, నకిలీ విత్తనాలను గుర్తించడంలో మెలకువలపై సీడ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ డా.కేశవులు వివరించారు.
ఇవీ చూడండి: కరోనా సెంచరీ..105కి చేరిన మృతులు