రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వాళ్లపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై పోలీస్ కమిషనర్లు, ఐజీలు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా పనిచేసి నకిలీ విత్తనాలను అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంలో ఉత్తమ ప్రతిభ కనపరిచే పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు.
వారి వివరాలు సేకరించండి:
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్ట్ అయినవారి వివరాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతుల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, మార్కెటింగ్, స్థానిక నెట్ వర్క్ వంటి వివరాలన్నీ సేకరించి.... తగిన కార్యచరణ రూపొందించుకోవాలని చెప్పారు. అధీకృత, గుర్తింపు పొందిన విత్తన విక్రయదారులు, డీలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయదారులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖకు అందించేలా అవగాహన కల్పించాలని మహేందర్ రెడ్డి తెలిపారు.
సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా:
పత్తి, మిరప విత్తనాల్లో అధికంగా నకిలీవి వస్తున్నాయని... నకిలీ విత్తనాలను గుర్తించే విధానంపై పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. గతేడాది రాష్ట్రంలో 104 మంది నకిలీ విత్తన విక్రయదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించడంతో.. ఇతర రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను తయారుచేసి రాష్ట్రంలో అక్రమంగా విక్రయిస్తున్నారన్నారు. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠినంగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు.