లాక్డౌన్ సమయంలో సేవా దృక్పథంతో నిరుపేదలు, వలసకూలీలకు చేయూతనందించిన క్రియా సంఘ్ సొసైటీని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. క్రియా సంఘ్ సొసైటీ వ్యవస్థాపకులు షేక్ నయీమ్‌తో పాటు అతని బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రాన్నిఅందజేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి చేతుల మీదుగా క్రియా సంఘ సొసైటీ వ్యవస్థాపకులు షేక్ నయీమ్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
లాక్డౌన్ సమయంలో వారు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఆహారాన్ని అందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు షేక్ నయీమ్ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తమ సంస్థ సభ్యుల ద్వారా రెండు లక్షల 45 వేల ఆహార ప్యాకెట్లు, మూడు వేలకు పైగా రేషన్ కిట్లు, శానిటరీ ప్యాడ్లు, మాస్కులు, 500 మంది వయోవృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు వారికి మందులను పంపిణీ చేసినట్లు వివరించారు.
ఉత్తమ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర పోలీసు శాఖ అభినందించడం పట్ల నయీమ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూడా పేద వారికి సాయం చేస్తూ.... సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.