Road Accidents in Telangana: రాష్ట్రంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హాట్స్పాట్లను ఇప్పటికే గుర్తించడం జరిగిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో.. ఆ ప్రమాద ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో.. రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రహదారుల భద్రతా చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
DGP on Road Accidents in Telangana : తమ పరిధిలోని నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 108 వాహన పనితీరుపై కూడా సమీక్షించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలతో సహా సంబంధిత శాఖల అధికారులు.. స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వీటి నివారణకు చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.
రాష్ట్రంలో 4983 కిలోమీటర్ల జాతీయ రహదారులు.. 1687 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు.. 32,913 కిలోమీటర్ల జిల్లా, గ్రామీణ రహదారులు మొత్తం 29,583 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు శివధర్ రెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, రోడ్ సేఫ్టీ విభాగం ఎస్పీ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
- గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు..
సంవత్సరం | రోడ్డు ప్రమాదాలు | మరణించిన వారి సంఖ్య |
2020 | 19,172 | 2882 |
2021 | 21,315 | 7577 |
2022 | 21,619 | 7559 |
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. మొత్తంగా వీటి వల్లే 53 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
- గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాలు..
సంవత్సరం | ద్విచక్ర వాహన ప్రమాదాలు | మరణించిన వారి సంఖ్య |
2020 | 9097 | 3469 |
2021 | 10,598 | 4082 |
2022 | 10,653 | 3977 |
రాష్ట్రంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 16 శాతం సైబరాబాద్‌లో.. 16 శాతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. 12 శాతం హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో జరుగుతున్నాయని అంజనీ కుమార్ తెలిపారు. కుమురం భీం అసిఫాబాద్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తక్కువగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని వెల్లడించారు. ఇందులో ఈ ప్రమాదాలను 47 శాతం తగ్గించడంతో పాటు.. 63 శాతం మరణాలను తగ్గించడంలో ములుగు జిల్లా మంచి ఫలితాలు సాధించిందని అభినందించారు. ఇందుకు చర్యలు చేపట్టిన జిల్లాల ఎస్పీలను అంజనీ కుమార్ అభినందించారు.
1602 హాట్స్పాట్ల గుర్తింపు: 2021-22 సంవత్సరంతో పోల్చితే.. 2023 మొదటి మూడు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య.. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 29 ,583 కిలోమీటర్ల రోడ్ల విస్టీర్ణంలో.. 1602 ప్రమాదం జరిగేందుకు అవకాశమున్న హాట్స్పాట్లను గుర్తించామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాల్లో సంబంధిత శాఖల సహాయంతో నివారణ చర్యలు చేపట్టామని శివధర్ రెడ్డి చెప్పారు.
ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు: ప్రస్తుతం జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా.. 45 సంవత్సరాలు దాటిన డ్రైవర్లందరికి కంటి పరీక్షలు నిర్వహించామని డీజీ శివధర్ రెడ్డి తెలిపారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణమయ్యే అంశాలపై కళాజాతరలతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరుగుతున్నాయని శివధర్ రెడ్డి వివరించారు.
ఇవీ చదవండి: CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023.. BRS టార్గెట్ @100
సైబర్ యుద్ధానికి భారత్ సై.. చైనాను వణికించేలా సైన్యంలో కొత్త విభాగం!