Anjani Kumar serious about fake seeds: మంచి విత్తనం చేతికొస్తే పంట దిగుబడి పెరుగుతుందన్న రైతు ఆశను నకిలీ విత్తనాలు ఏటా కడగండ్ల పాలు చేస్తున్నాయి. విత్తన కంపెనీల మోసాలు, నాసిరకం విత్తన కష్టాలతో రైతన్న పొలంలో చల్లుతున్న విత్తనాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టడానికి ప్రత్యేక దృష్టిసారించింది.
నకిలీ విత్తనాల విక్రయాలపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విక్రయదారులకు ఆయన హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా వ్యవహరిస్తోందని తెలిపారు. గత 8 ఏళ్లగా నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్న ఆయన.. పోలీస్ శాఖ తరపున 991 కేసులు నమోదు చేసి 1932మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
Village level committees for fake seeds: తరచూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 58మందిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు అంజనీ కుమార్ వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేశామని.. నకిలీ విత్తనాలను నివారించడానికి గ్రామస్థాయి నుంచి నిఘా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు.
తక్కువ ధరకే విత్తనాలు.. మోసపోతున్న రైతులు: నకిలీ విత్తనాల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న వాటిని విక్రయించే వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రముఖ కంపెనీల పేర్లతో కవర్లు తయారుచేసుకొని గ్రామీణ స్థాయిలో రైతులకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే ఆ విత్తనాలు లభించడంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నారుమడులు తయారు చేసుకొని కొండత ఆశతో విత్తనాలు వేస్తే వారికి నిరాశే మిగులుతోంది. ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, వరిలో ఈ నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. గ్రామస్థాయిలో వీటి విక్రయాలపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దృష్టి సారించి వాటిని అదుపుచేయాలని రైతులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి:
నగర శివారుల్లో.. నకిలీ విత్తనాల దందా
'నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్.. రాచకొండ సీపీ వార్నింగ్'
'మాకు అవకాశమున్న 141 టీఎంసీలు వాడుకుంటాం'
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్