Deputy CM Bhatti Vikramarka Speech at Telangana Bhavan in Delhi : ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ(PM Modi)ని కలిశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను సాధించటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రధానితో చర్చించామని ఈ సందర్భంగా వెల్లడించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
'ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి'
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి : విభజన చట్ట(Bifurcation) ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరామని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామని వివరించారు. తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక స్కూల్ మంజూరు చేయాలని అడిగామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
బీఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశామని చెప్పారు. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న నిధులు త్వరగా విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. తాము చేసిన విజ్ఞప్తుల పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తామన్నారు.
"పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, 2019-20, 21-22, 22-23, 23-24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1800 కోట్లు విడుదల చేయాలని వారు ప్రధానమంత్రిని కోరాము. రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అందులో కేవలం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగతా 12 రహదారుల అప్‌గ్రేడ్‌నకు ఆమోదం తెలపాలి." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
ఎఫ్ఆర్బీఎం పరిమితి సడలింపు అడగలేదు : ఎఫ్ఆర్బీఎం పరిమితి సడలింపు గురించి అడగలేదని వివరించారు. కానీ విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ప్రధానికి వివరించామని పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయాన్ని చేస్తామని ప్రధాని అన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి శాఖాపరంగా కేంద్రం నుంచి పెండింగ్ నిధులు గురించి నివేదిక ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్, భట్టి
పెండింగ్ బిల్లుల కోసం నిధుల సమీకరణపై సర్కార్ దృష్టి - కేంద్రంపైనే ఆశలన్నీ!