Demolition of Shops In Vishaka: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పెద్ద వాల్తేరులో బాపన దిబ్బ వద్ద కారు షెడ్లు, హోటల్‌తో పాటు.. చిన్నచిన్న దుకాణాలు నిర్మించుకుని 30 ఏళ్లుగా బాధితులు జీవనోపాధి సాగిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ హాస్టల్‌కు ఆనుకుని ఈ స్థలం ఉంటుంది. కొద్దిరోజులు క్రితం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. దుకాణాల్ని మూసి ఉంచాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రధాని భద్రతలో భాగంగా తాము సహకరిస్తామని దుకాణదారులు అందుకు ఒప్పుకున్నారు. ఇంతలోనే సోమవారం అర్ధరాత్రి తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా మొత్తం దుకాణాలను నేలమట్టం చేశారు.
అనేక ఖరీదైన కార్లను ఇక్కడ రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ కార్లు కొన్ని పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ మధ్యనే రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి దుకాణాలకు కొత్త రేకులు, రంగులు వేసుకున్నారు. ఇప్పుడా దుకాణాలు నేలమట్టమవడం కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే సామాన్లు తీసుకునే అవకాశం ఉండేదని వాపోయారు.
"మేము 1989-90 సంవత్సరం నుంచి.. ఒక్కొక్కరం దాదాపు రెండు లక్షలు అడ్వాన్స్‌లు ఇస్తూ, నెలకు అద్దె చెల్లిస్తూ, అప్పులైనా ఇవి ఉన్నాయనే నమ్మకంతో ఇప్పటి వరకు జీవనం కొనసాగిస్తున్నాము. రాత్రి 12 గంటలకు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. తెల్లవారి వచ్చి చూసే సరికి మొత్తం కూల్చేసి ఉన్నాయి". -బాధితుడు
"ఈ రోజు మేము నడి రోడ్డుపై పడిపోయాము. భార్యపిల్లలతో, పని చేసే కుర్రాళ్లు అందరం నడి రోడ్డుపై ఉన్నాము. జీవనోపాధి లేదు. మాకు దీనిపై ఎటువంటి సమాచారం లేదు. రాత్రికి రాత్రే దొంగలు వచ్చినట్లు, యుద్ధం కన్నా అన్యాయంగా మారిపోయింది మా బతుకు". -బాధితుడు
బాపన అప్పారావు కుటుంబం ఈ స్థలాన్ని సుప్రీంలో గెలుచుకుందని అయినా.. అర్థరాత్రి షెడ్లను కూల్చివేయడం దారుణమని స్థానిక శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ స్థలం పైన ఏయూ వీసీ, ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని.. అందుకే మోదీ పర్యటన పేరుతో వీరి నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణబాబు ఆరోపించారు.
"వ్యాపారరీత్యా వీళ్లు చిన్నచిన్న షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. టిఫిన్ సెంటర్లు, పాత ఇనుప సామాగ్రి దుకాణాలు ఉన్నాయి. నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి కూల్చివేశారు. గత నాలుగురోజుల క్రితం విజయసాయి రెడ్డి, వీసీ ప్రసాద్‌రెడ్డి ఇటు నడిచి వచ్చారని స్థానికులు చెప్తున్నారు. వాళ్లు వచ్చారంటేనే నాలుగు రోజులుగా అనుమానంగా ఉందని బాధితులు అంటున్నారు. అసలు రాత్రి 12 గంటలకు నోటీసులు లేకుండా రావటం ఏంటి. ఈ దుర్మార్గం ఏంటి". -వెలగపూడి రామకృష్ణబాబు, తెదేపా నేత
చెట్లు తొలగించమని ప్రధాని మోదీ చెప్పలేదని ప్రధాని పర్యటన పేరు చెప్పి విధ్వంసం చేస్తున్నారని.. జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ఆరోపించారు.
"ఇక్కడ సుప్రీం కోర్టుకు వెళ్లి గెలిచివచ్చారు. సుప్రీంకు వెళ్లిన ముగ్గురు మహిళలు జీవించే ఉన్నారు. వాళ్లు రోదిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా.. ప్రసాద్ రెడ్డికి వర్తించదా అని వాళ్లు బాధపడుతున్నారు. ఇటువంటి అరాచకాలు చేయటం ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్నారు. ఆయన మళ్లీ ఎన్నికలలో గెలవకుండా చేస్తున్నారు. ఇలా చేయకూడదు. అన్యాక్రాంతమైంది తీసుకోండి. కానీ, చట్టబద్దంగా తీసుకోండి". -బొలిశెట్టి సత్య, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నష్ట పోయిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని.. లేని పక్షంలో వైకాపా మినహా అన్ని పార్టీలు ఒకటై పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
ఇవీ చదవండి:
తెలంగాణలో పాక్షికంగా చంద్రగ్రహణం.. రేపు దర్శనాలకు అనుమతి
ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
Hit 2: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడవి శేష్!