KTR US Investments: పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న మంత్రి కేటీఆర్.. బృందానికి అద్భుత స్పందన లభిస్తోంది. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్‌వేద కంపెనీకి మంచి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు... ఈ అమెరికన్ సంస్థ సేవలందిస్తోంది. తెలంగాణలో 150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు కెమ్‌వేద తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 500 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంది. విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నామని, ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని కంపెనీ తెలిపింది.
ఆకర్షణీయ పెట్టుబడులకు గమ్యస్థానం..
హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో ఉన్న మానవ వనరులు అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుంది అని కేటీఆర్ తెలిపారు.
మీరు భాగంకండి...
హైదరాబాద్ ఔషధ నగరిలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పిడి, జాయింట్ రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో స్క్రిప్స్ తన భాగస్వామ్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ స్క్రిప్స్ బృందంతో సమావేశమయ్యారు. సైన్స్ పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థగా స్క్రిప్స్ రీసెర్చ్‌కు పేరుంది. 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు 200 కంటే ఎక్కువ ప్రయోగశాలలు ఈ సంస్థకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్, లాభాపేక్షలేని బయోమెడికల్ పరిశోధన సంస్థ ఇది. ఈ సంస్థకు చెందిన ఐదుగురికి ప్రఖ్యాత నోబెల్ బహుమతులు వచ్చాయి. స్క్రిప్స్ సంస్థకు దాదాపు 1,100 పేటెంట్లు ఉన్నాయి. ఎఫ్‌డీఏ-ఆమోదిత 10 చికిత్సా విధానాలను కనుగొనడంతో పాటు 50కి పైగా స్పిన్-ఆఫ్ కంపెనీలను స్క్రిప్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్యంపై త్వరలోనే చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: CM KCR on Kashmir Files: 'ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం'