Deisel Effect On Cabs: సూర్యుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతకు అల్లాడుతున్నారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. క్యాబ్‌లలో వెళ్లేవారికి కచ్చితంగా ఏసీ వేయాలనే నియమం ఉంది. ఏసీ వేయమని ప్రయాణికులు వేయడం కుదరదని డ్రైవర్లు చెప్పడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఏసీ వేస్తే గిట్టుబాటు కాదని డ్రైవర్లు వాదిస్తే వేయకుంటే ప్రయాణించడం కుదరదని ప్రయాణికులు చెబుతున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో.. ఏసీ వేయడం గుదిబండగా మారిందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో డీజిల్ ధరలు ఇబ్బందిగా మారాయని వాపోతున్నారు.
రాష్ట్రంలో లక్షా 26 వేల ట్యాక్సీలు, క్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 40 వేలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఇప్పటికీ సాప్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడంతో పూర్తి స్థాయిలో తిరగడం లేదు. వీరిలో క్యాబ్‌లను అద్దెకు తీసుకుని నడిపేవారే ఎక్కువగా ఉన్నారు. ఓలా, ఊబర్ వంటి సంస్థలు డీజిల్‌కు తక్కువగా ఉన్నప్పటి ధరలనే అమలు చేస్తుండడంతో ఏసీ అదనపు భారంగా మారిందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏసీ వేయడం వల్ల మైలేజీ తగ్గి మరింత భారంగా తయారవుతోందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి అత్యాచారం..! నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు