కరోనా తీవ్రత పెరుగుతున్నందున డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థలు మూసివేసి ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని నిన్న ప్రభుత్వం ప్రకటించింది.
అయితే సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఓయు, కేయూ, జేఎన్టీయూహెచ్, అంబేడ్కర్ యూనివర్సిటీ తెలిపాయి. ఇవాళ పరీక్షలు కూడా నిర్వహించాయి. వసతి గృహాలు మూసివేసినందున పరీక్షలు రాయడం కష్టమవుతోందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాయి. పరీక్షలపై ఇవాళ సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యా మండలి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది. పరీక్షల కొత్త తేదీలను తర్వాతి ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు.