Decreasing Paddy Cultivation: రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వం వడ్లు కొనబోమని తేల్చి చెప్పడంతో... అధిక శాతం రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లుతున్నారు. ఈ యాసంగి సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటల సాగువిస్తీర్ణం పెరుగుతుంది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 45.49 లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ ప్రతిపాదించగా... ఇప్పటివరకు 12.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు.
విస్తీర్ణం తగ్గే సూచనలు...
వరి 31 లక్షల ఎకరాలు నిర్దేశించగా... మారిన పరిణామాల కారణంగా ఇప్పటివరకు 1.18 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది యాసంగిలో ఇదే సమయానికి 3.07 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా సమయం ఉన్నందున వరి సాగు విస్తీర్ణం తగ్గే సూచనలున్నాయని పేర్కొన్నారు.
లక్ష్యానికి మించి...
మరోవైపు రాష్ట్రంలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలకుగాను... ఇప్పటివరకు 1.83 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. జొన్న 75వేల274 ఎకరాలకుగాను 53 వేల ఎకరాలకు చేరింది. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు ఉండగా... 3.14 లక్షల ఎకరాలకు ఎగబాకింది. పల్లి సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలకుగాను... ఇప్పటివరకు లక్ష్యానికి మించి 3.06 లక్షల ఎకరాల్లో సాగవుతోంది.
మినుములు, కందులు, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వులు, నూనెగింజల పంటలు, ఇతర చిరుధాన్యాల పైర్లు సాగు చేసేందుకు కూడా పలుచోట్ల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ చూడండి: Sircilla Ground water Level: సిరిసిల్లలో పెరిగిన భూగర్భజలాలు.. కాళేశ్వరం, మధ్యమానేరుతో జలసిరులు