విజయవాడ చిన్నారి ద్వారక హత్య కేసు నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితుడు పెంటయ్య అలియాస్ ప్రకాశ్‌కు... మహిళా సెక్షన్ కోర్టు న్యాయమూర్తి ప్రతిభాదేవి మరణశిక్ష ఖరారు చేశారు. 2019 నవంబర్ 10న.. గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. అనంతరం హత్య చేసినట్టు రుజువు కావటంతో శిక్ష ఖరారు చేశారు.
పశ్చిమ డివిజన్ ఏసీపీ సుధాకర్ ఆధ్వర్యంలో 35 మంది సాక్షులను విచారించిన అనంతరం... పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా న్యాయస్థానం ఈ శిక్షను విధించింది. అయితే ఉరిని హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుందని న్యాయవాదులు స్పష్టం చేశారు.
అసలేం జరిగింది:
చిన్నారి ఇంటి పక్కనే పెంటయ్య నివాసముంటున్నాడు. పెంటయ్య టీవీ చూడటానికి చిన్నారి ఇంటికి వెళ్లాడు. ద్వారకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ద్వారక కేకలు వేయడంతో భయపడి.. గొంతు, ముక్కు నొక్కిపెట్టడం వల్ల బాలిక చనిపోయిందని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. పాప మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పారేయాలని ప్రయత్నం చేశాడు. ఆరోజు పాప కనిపించడం లేదని.. తల్లిదండ్రులతో కలిసి వెతికాడు. ఆనంతరం చిన్నారి మృతదేహం పెంటయ్య నివాసంలో దొరికింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పెంటయ్యను దోషిగా నిర్ధారించారు. భవానీపురం పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు సేకరించడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
ఇదీ చదవండి: రెండు బిల్లుల రద్దును నిరసిస్తూ హైకోర్టులో రాజధాని రైతుల పిటిషన్