జమ్ము సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్ రెడ్డి (JAWAN JASWANTH REDDY) పార్థివ దేహం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో మద్రాస్ రెజిమెంట్ సైనికులు తీసుకొచ్చారు. జశ్వంత్ రెడ్డి భౌతికకాయానికి ఏపీ ఉప సభాపతి కోన రఘుపతి నివాళులర్పించారు. బాపట్ల నుంచి కొత్తపాలెం వరకు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఊరేగింపు మధ్య పార్థివ దేహాన్ని తరలించారు. నేడు కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి (JAWAN JASWANTH REDDY) భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొననున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జవాను మరుపోలు జశ్వంత్‌రెడ్డి (JAWAN JASWANTH REDDY) మృతి చెందారు. ఈ ఘటనతో జవాన్ జశ్వంత్‌రెడ్డి సొంతూరు బాపట్ల మండలం దరివాద కొత్తవాసి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో జశ్వంత్‌రెడ్డితో పాటు మరో భారత జవాన్ వీరమరణం పొందారు.
ఇదీ చదవండి: త్వరలో వివాహం చేయాలనుకున్నారు.. అంతలోనే వీరమరణం
శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్‌రెడ్డి (JAWAN JASWANTH REDDY). మరికొద్ది రోజుల్లో అతనికి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ ఈలోపు ఆయన ఉగ్రవాద దాడికి బలైపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జశ్వంత్ రెడ్డి (JAWAN JASWANTH REDDY)కి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించాడంటూ.. తల్లిదండ్రులు విలపించిన తీరు కంటతడి పెట్టిస్తోంది.
జశ్వంత్ రెడ్డి (JAWAN JASWANTH REDDY) మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 17 మద్రాస్ రెజ్మెంట్లో 2016 లో సైనికునిగా జశ్వంత్.. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించారు. అనంతరం జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు.
జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి: అమర జవాను కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల సాయం