Dasoju Shravan Resigned From BJP: భాజపాకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. పార్టీలో దశ, దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. మునుగోడులో భాజపా వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని ఆరోపించారు. పార్టీ తీరును నిరసిస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని తెలిపారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్ బండి సంజయ్‌కి రాజీనామా లేఖ పంపారు.
‘‘ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పి మునుగోడు ఉప ఎన్నికలో భాజపా వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలి.. పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లు కొనసాగిస్తున్న వైఖరి.. నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది. అనేక ఆశయాలతో నేను భాజపాలో చేరినప్పటికీ దశాదిశ లేని నాయకత్వ ధోరణులు.. నిర్మాణాత్మక రాజకీయాలకు, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైంది. ప్రజాహితమైన పథకాలు, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్న తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని శ్రవణ్ పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో శ్రవణ్ కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. బానిస బతుకు బతకడం ఇష్టంలేకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. రాజీనామా సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం దిల్లీ వెళ్లి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆ పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత శ్రవణ్ తెరాసలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: Dasoju Sravan: ప్రజాస్వామ్య తెలంగాణను నిర్మించేలా భాజపాలో పని చేస్తా: దాసోజు శ్రవణ్
బ్రిటన్ ప్రధాని రాజీనామా.. మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్
ఏడాది తర్వాత బ్యాలెట్ పేపర్ల రీకౌంటింగ్.. మళ్లీ ఒక్క ఓటుతోనే ఓడిపోయిన అభ్యర్థి