వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం అవుతోంది. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఎంటమాలజి, మెడికల్ అధికారులతో కమిషనర్ దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు నగరంలోని అన్ని మురికి వాడల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే బస్తీలు, ఎక్కువగా ప్రభావం ఉండే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. బుధవారం నుంచి హైదరాబాద్ నగరంలో దాదాపు 500 మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. జులై 20లోగా వైద్య శిబిరాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 6 వేలకు పైగా పాఠశాలల్లో అంటువ్యాధులు, దోమల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మెదడువాపు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో మలేరియా, డెంగీ, మెదడువాపు సమస్యలతో వచ్చే రోగుల వివరాల నివేదికను ప్రతిరోజు జీహెచ్ఎంసీ కార్యాలయానికి అందించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను మ్యాపింగ్ చేసి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని దానకిశోర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్