రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ పరిధిలోని రహదారులపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ను రోడ్డుకు సమాంతరంగా పెంచాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై దాదాపు 20 వేల మ్యాన్ హోల్స్‌ను గుర్తించామని... వీటికోసం రూ.6 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ మరమ్మతులు చేసేటప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ పనుల అనంతరం ఏర్పడిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.
ఈ పనుల వల్ల నగర పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో రాత్రి సమయాల్లో పనులను చేపట్టాలని తెలిపారు. నవంబర్ మూడో వారంలోగా ఈ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు