లాక్‌డౌన్ సమయంలో కొన్ని రకాల నిత్యావసరాల ధరలు తెలుగురాష్ట్రాల్లో భారీగా పెరిగాయి. రైతు బజారు ధరల ప్రకారమే అల్లం కిలోకు రూ.50 వరకు పెరిగి రూ.120కు చేరింది. చిల్లర దుకాణాల్లోనైతే రూ.200 వరకు తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో వెల్లుల్లిపై కిలోకు రూ.80 పెంచి రూ.220కు అమ్ముతున్నారు. మినపగుళ్లు ధర రూ.110 నుంచి రూ.140 దాకా చేరింది. కందిపప్పు 20 రోజుల కిందట కిలోకు రూ.85 ఉంటే.. ఇప్పుడు రూ.110కి చేరింది. ఎండుమిర్చి, చింతపండు, ధరల్లోనూ పెరుగుదల భారీగా ఉంది. వంట నూనెల పరిస్థితీ ఇదే.
ఇవి కారణాలు...
- మిల్లుల్లో పనిచేసే కూలీలకు పాస్‌లిచ్చినా పోలీసులు వాటిని అనుమతించడం లేదు. తెనాలిలో పాస్‌లు ఉన్నా కూలీలపై చేయి చేసుకున్నారు. ఉత్పత్తికి ఇలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
- గతంలో మిల్లులు 24 గంటలు పనిచేసేవి. కూలీల కొరత కారణంగా ఇప్పుడు 6 గంటలకు మించి పనిచేయడం లేదు. కూలిరేట్లూ గతంతో పోలిస్తే పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
- హైదరాబాద్ నుంచి రవాణా ఖర్చు క్వింటాలుకు రూ.100 వరకు ఎక్కువైంది. లారీ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఏదో ఒక లోడు నింపేవారు. ఇప్పుడు నిత్యావసరాలు మినహా మరేవీ అనుమతించడం లేదు. ఖాళీగా తిరిగి వస్తున్నాయి.
- దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలు నౌకాశ్రయాల్లోనే ఉన్నాయి. రవాణాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాల ట్రక్కులు రావడం లేదని వ్యాపారులు వివరిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రతోపాటు దిల్లీ మార్కెట్ నుంచి ఇడ్లీరవ్వ, గోధుమ రవ్వ రవాణా నిలిచిపోయిందని విజయవాడకు చెందిన వ్యాపారి వివరించారు.
ఇదీ చదవండీ... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు