గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందువల్ల కాలుష్యం అదే స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ కోసం... ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. జంటనగరాల్లో సైక్లింగ్‌ట్రాక్‌లు అభివృద్ధిచేస్తోంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తొలుత హుస్సేన్‌సాగర్ చుట్టూ సైక్లింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. ఓ వైపు పనులు వేగంగా జరుగుతుండగా... ఇటీవల నెక్లెస్‌రోడ్డులో నిర్మించిన రహదారికి ఇరువైపులా... సైక్లింగ్ కోసం ప్రత్యేక సూచికలు ఏర్పాటు చేశారు.
7 ట్రాక్‌లు ఏర్పాటు
ఖైరతాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా పరిగణించి దాదాపు 23 కిలోమీటర్ల పొడవునా... 7 ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో మెుదట 10 కిలోమీటర్ల చొప్పున రోడ్డుకు ఇరువైపులా... సైక్లింగ్ కారిడార్ రూపొందించనున్నారు. అవి వినియోగంలోకి వచ్చాక... సలహాలు, సూచనలు తీసుకొని మార్పులు చేర్పులు చేసి.. పూర్తి స్థాయిలో సైక్లింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. సైక్లిస్టుల భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకోనున్నారు.
స్థలాల వినియోగం
ఇక సైకిల్ స్టాండ్స్ కోసం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎంఆర్ఎల్, ఎమ్ఎమ్టీఎస్ స్థలాలను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. రాబోయే రెండు, మూడేళ్లలో దశల వారీగా హైదరాబాద్‌లో 450 కిలోమీటర్ల పొడవునా. సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో.....ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి.
నగరంలో తక్కువ దూరం ప్రయాణాలకు సైక్లింగ్ ఫ్రెండ్లీ ప్రత్యామ్నయంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి : రెండు రోజుల్లో మంచి స్పందన.. ఖజానాకు రూ.32 కోట్లు