రోడ్డు భద్రతపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, వాహనచోదకులు చేస్తున్న తప్పులపై గతంలో ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ వద్ద అవగాహన కల్పించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. అందరి వద్ద చరవాణి ఉండడం వల్ల దాని ద్వారానే... ట్రాఫిక్ నియమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
అందులో భాగంగానే.. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ లలో సైబరాబాద్ ట్రాఫిక్‌పోలీస్ ఖాతాలు తెరిచారు. మొదట్లో అంతగా ఆసక్తి కనబరచకపోయినా... సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా విజయ్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిలో చాలా మార్పులు చేసి ట్రెండ్‌కు తగ్గట్టుగా మీమ్స్ చేస్తూ ఆకర్షిస్తున్నారు.
మీమ్స్‌తో ఆకట్టుకునేలా..
నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సీసీటీవీ ఫుటేజ్‌లు... నిబంధనలు పాటించని వారి ఫోటోలతో ఆకట్టుకునేలా మీమ్స్ తయారుచేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి మంచి స్పందన వస్తోంది. సినిమా, క్రికెట్, బిగ్‌బాస్ వంటి అంశాలపై మీమ్స్ ఉండటంతో నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు.
లాక్డౌన్ సమయంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా పేజీలకు వేల మంది ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు పెరిగారు.
పెరిగిన అవగాహన
పోస్టు చేస్తున్న ప్రతి మీమ్... ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఎవ్వరినీ కించపరిచేలా లేకుండా వీటిని తయారు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహన చోదకులకు అవగాహన కల్పించడమే తమ ఏకైక లక్ష్యమని చెబుతున్నారు. తాము ట్విట్టర్లో పోస్ట్‌లకు పలువులు సినీ ప్రముఖులు స్పందించినట్లు తెలిపారు.
ఏదైన రోడ్డు ప్రమాదం జరిగినపుడు ప్రమాదం జరిగిన విధానం, కారణం, ఎలా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి అనే దానిపై కూడా విశ్లేషణ చేస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కృషితో ప్రమాదాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తున్నారు. ఇటీవల వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ నుంచి కోలుకున్నా.. ఇతర సమస్యలతో అతలాకుతలం