police notice to saidharm tej : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి.. కోలుకున్న హీరో సాయిధరమ్‌తేజ్‌కు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్ తదితర రికార్డులు ఇవ్వాలని 91 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే తాము జారీ చేసిన నోటీసులపై సాయిధరమ్ తేజ్నుంచి ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
దుర్గం చెరువు తీగల వంతెనపై సెప్టెంబర్10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నటుడు సాయిధరమ్‌తేజ్‌కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఓవర్ స్పీడింగ్ వల్ల ప్రమాదం జరిగినట్లు రాయదుర్గంలో కేసు నమోదైంది. సుమారు 40 నుంచి 45 రోజుల చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆయనకు 91సీఆర్పీసీ కింద పలు నోటీసులు జారీ చేశాము. కాని ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భవిష్యత్తులో ఈ కేసుపై ఛార్జిషీట్ దాఖలు చేస్తాము. స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ.
వార్షిక నేర నివేదిక విడుదల చేసిన సీపీ..
Annual Crime Report 2021 : సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. గతేడాదితో పోలిస్తే సైబరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు 218 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఆన్లైన్ చెల్లింపులు, డిజిటల్ తరగతులు, ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో పాటు వినియోగదారుల్లో అవగాహన లోపం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలు 13.2 శాతం పెరిగాయని, కొన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనిపించిందని సీపీ వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను పోలీస్ ఉన్నతాధికారుల మధ్య సీపీ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే రహదారి ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Sai Dharam Tej accident: మెగా అభిమానులకు శుభవార్త... కోలుకున్న సాయిధరమ్ తేజ్