Cyberabad Police Arrested Fake Cotton Seeds Gangs : నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో.. పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. వ్యవసాయశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమార్కులను పట్టుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్, రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు.. వ్యవసాయశాఖ అధికారులు నకిలీ విత్తనాలు విక్రయించే.. ఏడుగురు సభ్యులున్న రెండు ముఠాలను అరెస్టు చేశారు.
Spurious Cotton Seeds Gangs : వెంకటరమణ ముఠా వికారాబాద్‌లోని అనురాధ ట్రేడర్స్ విత్తనాల దుకాణంలో నకిలీ విత్తనాలు నిల్వ చేసి.. అసలు వాటికంటే తక్కువ ధరకే అంటూ రైతులను నమ్మించి విక్రయిస్తున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరో ముఠాకు చెందిన శివారెడ్డి ముఠా నగరశివారు ప్రాంతంలోని బాచుపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో.. వీటిని విక్రయిస్తున్నారని వివరించారు. ఈ రెండు వేర్వేరు ముఠాల గురించి సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం : పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి.. రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 2.65 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన : రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని.. రంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీత సూచించారు. తక్కువ ధరలకే విత్తనాలు విక్రయించే వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ బృందాలు వీటి గురించి.. అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని ఆమె వివరించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలపై నిఘా ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తరహా ముఠాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
"నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ.85 లక్షల విలువైన 2.65 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ తరహా ముఠాలపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ తరహా ముఠాల గురించి సమాచాం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాం. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం." - స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ
"కొంతమంది నకిలీ విత్తన ఉత్పత్తిదారులు.. రైతుల అవసరాలను ఆసరగా చేసుకొని వీటిని విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే రూ.100 నుంచి రూ.200 లకు తక్కువకే వీటిని అమ్ముతున్నారు. లైసెన్స్ దారులు అమ్మే విత్తనాల ప్యాకెట్ మీద పూర్తి వివరాలు ఉంటాయి. రైతులు విత్తనాలు కొనేటప్పుడు వీటిని గమనించాలి. ఇలాంటి వాటి పట్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలి." - గీత, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఇవీ చదవండి: Home Minister on Spurious Seeds : 'ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా చూడండి'
Fake Pesticides in Sangareddy : ప్రభుత్వం యుద్ధం ప్రకటించినా.. ఆగని 'నకిలీ' దందాలు