చరవాణులకు తరచూ బ్యాంకుల నుంచి సందేశాలు, లింకులు వస్తుంటాయి. సరి చూసుకోకుండా స్పందిస్తే అంతే సంగతులు. బ్యాంకు ఖాతాల్లోని నగదు క్షణాల్లో మాయం అవుతుంది. ఇదే తరహాలో ఝార్ఖండ్ జాంతారకు చెందిన సైబర్ నేరగాళ్ల ఐదుగురు సభ్యుల ముఠా.... హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యురాలిని మాయ చేసి రూ. 5 లక్షల 29వేలు కొల్లగొట్టింది. బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలను సమర్పించకపోతే మీ డెబిట్ కార్డు త్వరలోనే బ్లాక్ అవుతుందంటూ సంక్షిప్త సందేశం పంపి.... ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ , పాస్వర్డ్ తదితర వివరాలను తెలుసుకుని క్షణాల్లోనే ఖాతా ఖాళీ చేసేశారు.
జంతార ముఠా పనే...
తస్కరించిన నగదు వివిధ యూపీఏ ఐడీల ద్వారా బదిలీ అయినట్లు చరవాణికి బ్యాంకు నుంచి సందేశం రాగా.. డాక్టర్ ఖంగుతిన్నారు. ఆందోళనకు గురై బ్యాంకును సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. మోసపోయినట్లుగా గుర్తించిన వైద్యురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఝార్ఖండ్‌కు చెందిన జంతార ముఠా పనేనని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు విచారణ ప్రారంభించారు. అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో నిందితులను గుర్తించారు. కేసులో సంజయ్ కుమార్ ప్రధాన సూత్రధారి అని తేలింది.
తస్కరించిన సొమ్ముతో జల్సాలు..
ఇతర రాష్ట్రాల పోలీసులకు ఈ ముఠా చిక్కకుండా తిరుగుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠా కొల్లగొట్టిన సొమ్ముతో జల్సాలు చేసినట్టు విచారణలో తేలింది. వచ్చిన డబ్బును పంచుకొని నేరగాళ్లు ఇళ్లు, ఆధునిక గృహోపకరణాలు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి రెండు లక్షలకు పైగా నగదు, 12 గ్రాముల బంగారం, ఆరు చరవాణులు, డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్