సైబర్ నేరస్థులు రోజుకో పంతాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. మీరు ఫలానా ఏటీఎం నుంచి రూ.25 వేలు నగదు విత్‌డ్రా చేసుకున్నారు... విత్‌డ్రా చేసుకుంది మీరు కాదంటే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి... మీ నగదు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాం..’ అంటూ బ్యాంకుల పేరుతో సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు.
ప్రధానంగా యూనియన్ బ్యాంక్‌లో విలీనమైన ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని వారి చరవాణులకు సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. సైబర్ నేరస్థుల మాటలు నమ్మిన బాధితులు రూ.లక్షల్లో నగదు పోగొట్టుకున్నారు. బ్యాంక్ అధికారులను సంప్రదించి ఇది మోసమని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
విశ్రాంత అధికారులు.. మహిళలే లక్ష్యంగా
అంతర్జాల ఆధారిత ఖాతాలు, వారి ఫోన్ నంబర్లను తెలుసుకున్న తర్వాత సైబర్ నేరస్థులు విశ్రాంత అధికారులు, మహిళలకు మాత్రమే సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. వీరైతే వెంటనే స్పందిస్తారన్న ముందస్తు అంచనాతో ఇలా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సంక్షిప్త సందేశాలు రాగానే ఆ తేదీలో విత్‌డ్రా చేసుకోలేదు... నా వివరాలతో ఎవరో డబ్బు తీసుకున్నారన్న కంగారుతో బాధితులు నిందితులను సంప్రదిస్తున్నారని తెలిపారు.
నేరస్థులు బాధితులతో ఆంగ్లం, హిందీ భాషల్లో మాట్లాడటం, బాధితుల పేర్లు, చిరునామాలు, వివరాలన్నింటినీ తప్పులు లేకుండా చెబుతున్నారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఓ బ్యాంకు మాజీ అధికారి ఇలాగే స్పందించి సైబర్ నేరస్థులకు యూపీఐ నంబరు పంపించగా.. నిందితులు రూ.90 వేలు నగదు విత్‌డ్రా చేసుకున్నారని తెలిపారు.
ఇలా మోసం చేస్తున్నారు
ఆంధ్రా బ్యాంక్‌లో అంతర్జాల ఆధారిత బ్యాంక్ ఖాతాలున్న వారి వివరాలను సైబర్ నేరస్థులు సేకరిస్తున్నారు. తర్వాత వారి ఫోన్ నంబర్లు తీసుకుని రోజుకు 100 నుంచి 200 మంది చరవాణులకు ఆంధ్రా బ్యాంక్ నుంచి పంపినట్టే సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. మీరు రూ.25 వేల నగదు విత్‌డ్రా చేసుకున్నారు. మీరు చేసుకోనట్లైతే 9298112345 నంబర్‌కు సంక్షిప్త సందేశం పంపించండి.. మీ కార్డు బ్లాక్ చేసేందుకు 18004251515 నంబర్‌కు వెంటనే ఫోన్ చేయండి.. ఆంధ్రా బ్యాంక్ అంటూ సంక్షిప్త సందేశం పంపుతున్నారు. సంక్షిప్త సందేశం అందుకున్న వారు ఫోన్ చేస్తే.. అచ్చం బ్యాంక్ అధికారుల్లా మాట్లాడి మీరు పోగుట్టుకున్న నగదు ఖాతాలో జమ చేస్తాం అంటున్నారు. మీ చరవాణికి మేం పంపించిన లింక్‌ను తెరిచి అందులో వివరాలు నమోదు చేయండి అంటున్నారు.
యూపీఐ ఆధారంగా డబ్బు తస్కరణ
బాధితులు చూసుకోకుండా యూపీఐ నంబర్‌ను పంపుతున్నారు. యూపీఐ ఆధారంగా బాధితుడి బ్యాంక్ ఖాతాల్లోని నగదు నిల్వల్లో రూ.లక్షలను సైబర్ నేరస్థులు వారి ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. తమ ఖాతాల్లో నగదు విత్‌డ్రా అయ్యిందని బాధితులు తెలుసుకుని మాట్లాడేలోపు నేరస్థులు తమ ఫోన్ నంబర్లను స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!