హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్లో మద్యం బగ్గా వైన్స్ పేరుతో ఉన్న ప్రకటన తారస పడింది. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి మద్యం విక్రయిస్తున్నామని చెప్పి.. క్రెడిట్, డెబిట్ కార్టు నెంబర్ చెబితే నగదు తీసుకొని.. ఇంటికి మద్యం చేరవేస్తామని చెప్పాడు. ఓటీపీ చెప్పటంతో ఖాతాలో ఉన్న 48 వేలు విత్ డ్రా అయ్యాయి.
బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి పిండి వేరే ప్రాంతానికి తరలించేందుకు సమాచారం అందించే ఓ యాప్‌లో ట్రాన్స్ పోర్టు సంస్థ నెంబర్ తీసుకున్నారు. ఆ సంస్థకు ఫోన్ చేసి పిండి తరలించేందుకు రూ.85 వేలు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా రూ. 60వేలు చెల్లిస్తే వాహనం పంపిస్తామని చెప్పటంతో యాప్ ద్వారా నగదు చెల్లించాడు. అనంతరం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
నగరంలోని యాకుత్‌పురకు చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి వేరే దేశంలో షాపింగ్ చేసినట్లు చరవాణికి సందేశాలు వచ్చాయి. పొరపాటున వచ్చిన సందేశాలు అనుకున్నా.. కార్డు స్టేట్మెంట్ చూసేసరికి కంగుతిన్నాడు. క్రెడిట్ కార్డు ద్వారా 3.27 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించాడు. ఓటీపీల కోసం ఎవరూ ఫోన్ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య