సెల్‌ఫోన్ టవర్‌తో బోలెడంత ఆదాయమంటూ ప్రకటన ఓ వృద్ధురాలిని నిండా ముంచింది. లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నాక తాను మోసపోయినట్టు గ్రహించింది. కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆంగ్ల దినపత్రికలో సెల్ టవర్ ఏర్పాటుకు అనువైన స్థలం కావాలనే ప్రకటన ఆకర్షించింది. వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఉన్న మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసింది. అటువైపు మాట్లాడిన వ్యక్తి తాము ప్రముఖ సెల్ ఫోన్ సంస్థ ప్రొవైడర్లమంటూ నమ్మకం కలిగించేలా మాట్లాడారు. తమ సంస్థ ఏర్పాటు చేయబోయే సెల్ టవర్‌కు సరైన ప్రాంతం అదేనంటూ మాటలతో బురిడీ కొట్టించాడు. ఏడాదికి 90లక్షల ఆదాయం వస్తుందని... ప్రతినెలా బ్యాంకు ఖాతాలో జమచేస్తామంటూ మరింతగా ఊదరకొట్టాడు.
ఆశపడితే అంతే...
పేరున్న సంస్థ కావటంతో మహిళ కూడా నిజమనే అభిప్రాయానికి వచ్చింది. ఇరువురి మధ్య ఒప్పందంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఖర్చులకు మొదట ఐదువేలు వసూలు చేశాడు. కొద్దిరోజులకు టవర్ నిర్మాణానికి డిపాజిట్‌గా ఐదు లక్షలు రాబట్టాడు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపుతూ మోసగాడు వీలైనన్ని సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమచేయించుకున్నాడు. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందనే ఆశపడిన బాధితురాలు డబ్బులను చెల్లించేందుకు సొంత ఆస్తులను విక్రయించింది. ఇలా దఫాలవారీగా నవంబర్ 15 నుంచి డిసెంబరు 12వ తేదీ వరకూ 25 లక్షలు మోసగాడి ఖాతాలో జమచేసింది.
మోసపోయి పోలీసుల చెంతకు..
చివరకు తాను మోసపోయినట్టు గ్రహించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ పత్రికల్లో సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తామని... లక్షలరూపాయాల్లో అద్దెలు చెల్లిస్తామంటూ వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ విధంగా టవర్ల పేరిట ఎవరైనా ఫోన్ చేసినా... ప్రకటనల ద్వారా మభ్యపెట్టేందుకు ప్రయత్నించినా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఇవీ చూడండి: పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్ ఖాన్