CWC Members Election 2023: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు తెలంగాణకు దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక నామినేటెడ్ విధానంలో చేయాలని నిర్ణయించడంతో.. రాష్ట్ర నాయకుల ఆశలు ఆవిరయ్యాయి. రిజర్వేషన్ల ఆధారంగా పదవులు ఇవ్వాల్సి వస్తే.. సీడబ్ల్యూసీ సభ్యుడిగా మాజీ ఎంపీ మల్లు రవికి అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
No chance for Telangana in CWC Members Election :కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు.. ప్రధాన కార్యదర్శి పదవుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పదవైనా దక్కుతుందని పార్టీ వర్గాలు భావించాయి. ఎన్నికల ద్వారా సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికకు.. రాష్ట్రం నుంచి ముగ్గురు నాయకులు బరిలో దిగాలనుకున్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ పీసీసీ అధ్యక్షులు వీ. హనుమంతరావులు పోటీ చేయాలని యోచించారు .
కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల నియామకాన్ని హస్తం పార్టీ.. తమ అధ్యక్షుడికి అప్పగించింది. 85వ ప్లీనరీ సమావేశాల కారణంగా ఏకగ్రీవంగా స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడితో సహా 24మంది సీడబ్ల్యూసీ సభ్యులు ఉంటారు. ఇందులో 11 మందిని నామినేట్ చేయడం ద్వారా.. మరో 12 మందికి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నుకునే అవకాశం ఉండేది.
CWC Members Election: ఇప్పటికే తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా కొనసాగుతున్నారు. ప్రధానంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారనుకున్న వాళ్లకే పదవులు లభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికలో రిజర్వేషన్లు పాటించాల్సి ఉన్నందున.. సామాజిక వర్గాల ఎంపిక ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ కింద మల్లు రవికి అవకాశం దక్కే వీలుంది. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులుగా కేశవరావు, ఎం సత్యనారాయణలు ఉండేవాళ్లు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఈ పదవులు వచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనకు అనుకూలంగా, పార్టీ బలోపేతం చేసేందుకు అవకాశం ఉన్న సమర్థవంతమైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి: