Hyderabad police commissioner CV Anand : నగరంలో శాంతిభద్రతలతో పాటు సైబర్ క్రైం కట్టడికి పెద్దపీట వేస్తామని హైదరాబాద్ సీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని.... అదే స్థాయిలో కొనసాగిస్తామని చెప్పారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యముంటుందన్న ఆనంద్... ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు అమలుచేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు శనివారం స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ అయిన అంజనీకుమార్ సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. నగర కోత్వాల్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... హైదరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. తాను పుట్టి పెరిగిన నగరానికి సీపీగా రావటం ఆనందంగా ఉందని తెలిపారు.
నేను చదువుుకుని, పెరిగిన ప్రాంతానికి సీపీగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఈ మెట్రోపాలిటన్ నగరానికి సీపీగా బాధ్యతలు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఎన్నో ఏళ్ల పని చేశాను. భిన్న మతాల సమ్మేళనం హైదరాబాద్ సొంతం. కేసీఆర్ సీఎం అయ్యాక మొదటి సమవేశం శాంతి భద్రతలపైనే పెట్టారు. నగర శాంతిభద్రతలకు పెద్ద పీట వేస్తాం.
-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ తొలి ప్రాధాన్యమన్న సీవీ ఆనంద్.... ఇటీవల సైబర్ నేరాలు సవాల్‌గా మారాయన్నారు. ఆన్‌లైన్ మోసాలపై మరింత దృష్టి సారించి.... వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఇప్పటికే పోలీస్‌శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందని.... దానిని కొనసాగించి... డ్రగ్స్ నిర్మూలించటమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మత్తుపదార్థాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మహిళల భద్రతకు పెద్దపీట
నగరంలో మహిళ భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాను ట్రాఫిక్ అడిషనల్ సీపీ ఉన్న సమయంలో 'డ్రంక్ అండ్ డ్రైవ్'ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని చెప్పారు. ట్రాఫిక్ అంశాన్ని ప్రత్యేక ప్రాధాన్యతగా తీసుకోనున్నట్లు.... జీహెచ్ఎంసీ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కరోనా అనేక వేరియంట్లుగా వస్తున్నందున... ప్రభుత్వ ఆదేశాల మేరకు వైరస్ కట్టడికి చర్యలు చేపడతామని సీపీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఐపీఎస్‌ల బదిలీలు
రాష్ట్రంలో భారీఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్‌లతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. సీనియర్ ఐపీఎస్‌లతో పాటు సిద్దిపేట, నిజామాబాద్ పోలీసు కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది.
ఇదీ చదవండి: IMD Director Interview: రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మరింత పెరగనున్న చలి