gold seized at Shamshabad airport: ఎలాంటి కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారు. కొంతమంది చేస్తోన్న పని తప్పు అని తెలిసినా చేస్తారు. మరికొంత మంది తప్పు చేసినా దొరకమనే ధీమాతో రెచ్చిపోతుంటారు. ఇలాంటి ధీమాయే ఎప్పుడో ఒకప్పుడు వారిని పోలీసులకు పట్టిస్తుంది కటకటాల వెనక్కి నెట్టేస్తుంది. తాజాగా ఇలాంటి ఆలోచన ఉన్న ఓ వ్యక్తి అధికారులను బురిడీ కొట్టించి బంగారం అక్రమ రవాణా చేయాలనుకున్నాడు. చివరకు అధికారులకు చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుబడటం ఈమధ్య చాలా కామన్ అయిపోయింది. ప్రయాణికుల ముసుగులో కొంతమంది అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి బంగారం అక్రమ రవాణా చేస్తూ అధికారులకు చిక్కాడు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు అనుమానంగా కనిపించాడు. ఆ వ్యక్తిని తనిఖీ చేయగా లోదుస్తుల్లో బంగారం దాచినట్లు అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి 823 గ్రాముల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.47లక్షలు ఉంటుందని వెల్లడించారు.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు పాస్పోర్ట్ ఆధారంగా హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిరోజు ఇలా చాలా మంది ప్రయాణికుల ముసుగులో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని.. చివరకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: