అయిదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో... ఈ నెలలో దాదాపు రోజూ పీక్ డిమాండ్ సమయంలో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. 2016 నవంబరులో ఆఖరిసారి కోతల (Power cut)ను భరించిన ప్రజలకు అయిదేళ్ల తర్వాత చీకట్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయిదు నెలల కిందటే సంకేతాలు
విద్యుత్ సంక్షోభానికి అయిదు నెలల కిందటే సంకేతాలు అందాయి. గత జూన్‌లో రెండు రోజుల్లో 0.213 ఎంయూల విద్యుత్ సర్దుబాటు చేశాయి. జులైలో ఒకే రోజు 4.265 ఎంయూలు ఎల్‌ఆర్ విధించాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ సర్దుబాటు తప్పలేదు. ఈ నెలలో ఇప్పటివరకూ 6.168 ఎంయూల విద్యుత్ లోటు ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత 2015 మార్చి వరకు లోటు విద్యుత్‌తో ప్రజలు కోతలు భరించాల్సి వచ్చింది. తర్వాత పరిస్థితి మెరుగుపడింది. 2016 నవంబరు 7న 3.884 ఎంయూల విద్యుత్‌లోటు ఏర్పడటంతో కోతలు విధించారు. తర్వాత గత జూన్ వరకూ సాంకేతిక కారణాలు మినహా విద్యుత్ లోటుతో సరఫరా నిలిపేసిన పరిస్థితి రాష్ట్రంలో లేదు.
డిమాండ్‌కు రెండున్నర రెట్లు సామర్థ్యం
ఏపీలో ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్ సుమారు 8,500 మెగావాట్లు. 20,130 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లతో డిస్కంలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 8,075 మెగావాట్లు రావాల్సి ఉన్నా, అది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు. గ్యాస్ కొరతతో 100 మెగావాట్లే వస్తోంది. 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జెన్‌కో థర్మల్ ప్లాంట్ల నుంచి బొగ్గు కొరతతో 50% విద్యుత్తే అందుతోంది. అవసరానికి మించి రెండున్నర రెట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నసంస్థలతో పీపీఏలు కుదుర్చుకున్నా సంక్షోభం నుంచి బయటపడలేని పరిస్థితి ఏర్పడింది.
బొగ్గు ఉత్పత్తి తగ్గటమే కారణం: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్
దేశంలోని బొగ్గు గనుల్లో రెండేళ్లుగా ఉత్పత్తి తగ్గిందని, విదేశాల్లో బొగ్గు ధరలు పెరగడంతో దిగుమతి చేసుకునే పరిస్థితి లేదని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ‘గత మూడు నెలలు సింగరేణి నుంచి బొగ్గు తీసుకోకపోవటం ప్రస్తుత సంక్షోభానికి కారణం కాదు. ఏటా వేసవి డిమాండ్ సర్దుబాటు ఉత్పత్తి పెంచుకోవడానికి బొగ్గును అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ నిల్వ చేస్తాం. రాష్ట్రంలో బొగ్గు గనులు లేక ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గు సరఫరా పెంచాలని రాష్ట్రప్రభుత్వం ప్రధానిని కోరింది. చలికాలంలో గ్రిడ్ డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం.