ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలకు సిద్దిపేట జిల్లా వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వంటిమామిడి మార్కెట్‌ను నిన్న సందర్శించిన సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకులాల కార్యదర్శులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గురుకులాలు, వసతి గృహాలకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేసే విషయమై చర్చించారు.
ఈ సందర్భంగా కూరగాయల సరఫరా కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్న సీఎస్.. రైతులకు లాభం జరగడంతో పాటు నాణ్యమైన కూరగాయలు లభిస్తాయని పేర్కొన్నారు. వివిధ ఆర్థిక పథకాల కింద లబ్ధి పొందిన యువతను కూరగాయల సేకరణ, సరఫరాలో భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.
నిబంధనలకు లోబడే..
ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు కొవిడ్ నిబంధనలకు లోబడి నడిచేలా చూడాలని కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు. విద్యాసంస్థలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కలెక్టర్లను కోరారు. చాలా చోట్ల ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వెలుపల గురుకులాలు ఉన్నాయన్న సీఎస్.. అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: ఉగాదిలోగా పనులు పూర్తి చేయండి: మంత్రి ఎర్రబెల్లి